ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన... చైనా వాణిజ్యం, రవాణా వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా కూడా తమ దేశ పౌరులను చైనా వెళ్లొద్దంటూ ఆదేశించింది. ఈ క్రమంలో ఐరాసలోని చైనా రాయబారి జాంగ్ జున్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు జాంగ్ జున్. అతిగా చూపించడం చైనాకు ప్రతికూల చర్యగా అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను అడ్డుకోవడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలన్నారు.
"కరోనా వైరస్‌పై పోరాడే క్రమంలో మేము చాలా క్లిష్టమైన దశలో ఉన్నాం. ఈ సమయంలో అంతర్జాతీయ సంఘీభావం చాలా అవసరం. వైరస్ విషయంలో అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తిపై ప్రపంచ దేశాల ఆందోళనను చైనా అర్థం చేసుకుంది. అయితే వాణిజ్యాన్ని పరిమితం చేసే అధికారం డబ్ల్యూహెచ్ఓకు లేదు."
-జాంగ్ జున్, యూఎన్ చైనా రాయబారి
చైనాలో ఇప్పటివరకు 9,692మంది వైరస్ బారిన పడగా.. 213 మంది మృతి చెందారు. ఇతర 18 దేశాల్లో 98 మందికి మహమ్మారి సోకగా.. ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. వీరిలో ఎక్కువ మంది వైరస్ పుట్టిన వుహాన్ పట్టణానికి ఏదో విధంగా అనుబంధం ఉన్నవారే కావడం గమనార్హం.