మనం స్నేహితులతోనో బంధువులతోనో విహారయాత్రకు వెళితే మనలోనే ఒకరు ఫొటోగ్రాఫర్ అవతారమెత్తడం సహజం. ఎవరికీ అంతటి పరిజ్ఞానం లేకుంటే అక్కడే ఉండే ఓ ఫొటోగ్రాఫర్ చేతిలో కొంత మొత్తం పెట్టి ఫొటోలు తీయించుకుంటాం. అంతే తప్ప కేవలం ఫొటోల కోసం ఓ వ్యక్తిని నియమించుకోవడం ఎరుగం. కానీ ఈ మిలినీర్ మాత్రం తనతో పాటు ప్రయాణించి తన ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడితే చాలు లక్షల్లో నెల జీతం ఇస్తానని చెబుతున్నాడు!
ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ లెప్రె ఇటీవల ఓ ప్రకటన ఇచ్చాడు. అతడితో పాటు ప్రయాణిస్తూ ఆయన ఫొటోలు తీసి వాటిని పలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఆ ప్రకటన ఉద్దేశం. అందుకు నెలకు 37,600 డాలర్లు (సుమారుగా రూ. 26.6 లక్షలు) జీతం ఇస్తానని ప్రకటించాడు. అందుకు దరఖాస్తు చేసుకోవాలంటే పాస్‌పోర్ట్, ప్రయాణించాలనే ఉత్సుకత, సొంత కెమెరా ఉంటే చాలు అంటున్నాడు ఈ కుబేరుడు. ఇప్పటి వరకు లెప్రె ట్రావెల్ ఫొటోలన్నీ ఆయన స్నేహితుడు మిచ్ తీసేవారు. తన వ్యాపార విస్తరణలో భాగంగా మిచ్‌కు మరిన్ని పెద్ద బాధ్యతలు అప్పగించాడు లెప్రె. అందుకే మిచ్‌కు బదులు మరొక వ్యక్తిని తన ఫొటోలు తీసేందుకు నియమించుకోవాలని భావిస్తున్నాడు.
ఇదీ చూడండి: 'చైనా పద్మవ్యూహంలో భారత్.. అమెరికా సాయం అత్యవసరం'