2019 ఏప్రిల్ 21.. ఈస్టర్ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబోలోని మూడు చర్చిలు, మూడు విలాసవంతమైన హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 250 మందికి పైగా మరణించారు. ఆ మారణహోమం తర్వాత తొలిసారి శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దేశ జనాభాలో 7 శాతం ఉన్న కైస్త్రవులు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది కీలకంగా మారింది.
ఇక్కడున్న క్రైస్తవ వర్గంలో విచారణ జరుగుతోన్న తీరుపై అసంతృప్తి ఉంది. అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఒక్కటే... ఇంతటి మారణహోమానికి పాల్పడిన వారికి శిక్ష ఎప్పుడు పడుతుంది?
ఈ నేపథ్యంలో ఈస్టర్ బాంబు పేలుళ్లు జరిగిన సెయింట్ ఆంటోని చర్చి ఫాదర్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా మాట్లాడింది. బాంబు పేలుళ్ల కేసులో జరుగుతోన్న విచారణ, తదితర అంశాలపై ఫాదర్ పలు విషయాలు ప్రస్తావించారు.
"మాకు ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం కావాలి. ఎవరు ఈ దాడికి పాల్పడ్డారో.. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ దాడిపై ఇంతకుముందు కమిషన్లు ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేశారు. నివేదికలు వచ్చాయి. తాజాగా దర్యాప్తు కోసం మరో కమిషన్ ఏర్పాటు చేశారు. దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. దర్యాప్తు కమిటీ న్యాయం చేస్తుందని వేచి చూస్తున్నాం."
- జూడె ఫెర్నాండో, సెయింట్ ఆంటోనీ చర్చి ఫాదర్
ప్ర. ఈ అధ్యక్ష ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లు ఎలా కీలకం కానున్నాయి ?
జ. ఏ రాజకీయ పార్టీపైనా మాకు ప్రత్యేక ఆసక్తి లేదు. ఏ అభ్యర్థులకు మేం మద్దతు పలకలేదు. అయితే ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కు కనుక అందరినీ పోలింగ్‌లో పాల్గొనమని చర్చి ప్రోత్సహిస్తోంది. మేము ఎన్నికలను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. ఓటర్లుగా వారి ఎంపిక వారికి ఉంటుంది. దానికి అనుగుణంగా ఓటు వేస్తారు.
ప్ర. ఇంతటి గాయం నుంచి క్రైస్తవులు కోలుకోగలిగారా?
జ. ఈస్టర్ బాంబు పేలుళ్ల బాధితుల సహాయం కోసం, వారికి మనోస్థైర్యం ఇవ్వడం కోసం చర్చి ఆధ్వర్యంలో పలు సమావేశాలు నిర్వహించాం. వీటి వల్ల, భద్రత పెంచడం కారణంగా బాధితులు, క్రైస్తవులు ఇప్పుడిప్పుడే చర్చికు వస్తున్నారు.
ప్ర. ఆసియా ఉపఖండాల్లో ఎక్కువగా ఎదురవుతోన్న ఈ తీవ్రవాద సమస్యను ఎలా ఎదుర్కోవాలి?
జ. ఈ ఉపఖండాల్లో నివసించే ప్రజలు చాలా శాంతి, సహృదయం కలిగినవారు. మాకంటూ కొన్ని విలువలు, ఆచారాలు ఉన్నాయి. ఆసియా దేశాలైన భారత్, శ్రీలంక.. చిన్న చిన్న విభేదాలు ఉన్నా సఖ్యతతో ముందుకు వెళ్తున్నాయి. మన సనాతన విలువలు, ఆచారాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించి తీవ్రవాదంపై పోరాడేందుకు సిద్ధమవ్వాలి.
(నిషాంత్ శర్మ, ఈటీవీ భారత్ ఎడిటర్ ఇన్ చీఫ్)