అఫ్గానిస్థాన్‌లో గత 18 ఏళ్లుగా హింసకాండ కొనసాగుతూనే ఉంది. తాలిబన్ల ఏరివేతకు చేసే దాడుల్లో సామాన్యుల ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో జరిగిన మారణహోమంలో లక్ష మందికి పైగా సాధారణ పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.
సెప్టెంబర్ నెలలో తాలిబన్లతో అర్ధాంతరంగా చర్చలను నిలిపివేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే చర్చలు పునరుద్ధరిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ హింసాత్మక ఘటనల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
"అఫ్గానిస్థాన్‌లో ఐరాస సహాయ సంస్థ (యూఎన్ఏఎమ్ఏ) పనులు ప్రారంభించినప్పటి నుంచి నమోదు చేసిన గణాంకాల ప్రకారం గడిచిన దశాబ్ద కాలంలోనే ఒక లక్ష మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇది విచారకరమైన విషయం. శాంతియుతంగా జీవించాలని కోరుకునే అఫ్గానీయులను పరిగణనలోకి తీసుకోవాలని శాంతి చర్చలు చేపట్టేవారిని ఐరాస కోరుతోంది. దాని ద్వారా వారి జీవితాలను పునర్నిర్మించుకునేందుకు అవకాశం లభిస్తుంది."
-తడామిచి యమామోటొ, అఫ్గాన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధి.
మూడు నెలల్లో 11 వందల మంది..
ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు 1,174మంది మరణించగా... 3,139మంది గాయపడినట్లు ఐరాస వెల్లడించింది. గత ఏడాదిలోనూ రికార్డు స్థాయిలో 927మంది చిన్నారులతో సహా మొత్తం 3,804మంది మరణించినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: అమెరికా, రష్యాకు దీటుగా చైనా.. కారణం ఓ భారతీయుడు!