చైనాలోని యువాన్ రాష్ట్రం కైయువాన్లో ఓ వ్యక్తి పాఠశాలపై రసాయన దాడికి పాల్పడ్డాడు. కిండర్గార్టెన్ భవనంపైకి ఎక్కి సోడియం హైడ్రాక్సైడ్(కాస్టిక్ సోడా)ను విద్యార్థులపైకి వెదజల్లాడు. ఈ ఘటనలో 51మంది పిల్లలు, ముగ్గురు ఉపాధ్యాయులకు కాలిన గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
పాఠశాలలే టార్గెట్
రసాయన దాడి నేపథ్యంలో పాఠశాల వద్ద 40 నిమిషాలు హైడ్రామా సాగింది. పోలీసులు అతి కష్టం మీద దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని 23 ఏళ్ల కోంగ్గా గుర్తించారు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి... సమాజంపై ప్రతీకారం తీర్చుకోవాలన్న దురాలోచనతోనే కోంగ్ ఈ పని చేశాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
సమాజంపై ప్రతీకారం పేరిట చైనాలో పాఠశాలలపై దాడులు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. సెప్టెంబర్లో ఓ వ్యక్తి పాఠశాలలో కత్తితో వీరంగం సృష్టించి ఇద్దరిని బలిగొన్నాడు. మేలో మరో వ్యక్తి కారుతో దూసుకెళ్లి 13 మందిని గాయపరిచాడు.