కంటికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే ఐ డ్రాప్స్ వాడుతూ ఉంటాం. అలాంటి ఐ డ్రాప్స్‌తో ఓ మనిషిని హత్య చేయడం సాధ్యమా? అమెరికా దక్షిణ కరోలినా రాష్ట్రం యార్క్ కౌంటీలో జరిగిన ఘటన చూస్తే ఔననే సమాధానం వస్తుంది.
3 రోజుల్లోనే....
స్టీవెన్ క్లేటన్... ఫ్లోరిడాకు చెందిన వ్యాపారవేత్త. ఆస్తి విలువ 20 లక్షల డాలర్లు. యార్క్ కౌంటీలో స్థిరపడ్డారు. అత్యంత విలాసవంతమైన ఇంట్లో భార్య లానా క్లేటన్తో ఉండేవారు. ఉన్నట్టుండి 2018 జులైలో 64 ఏళ్ల వయస్సులో మరణించారు స్టీవెన్.
అనుమానాస్పద మరణంపై పోలీసులు దర్యాప్తు చేశారు. నమ్మలేని నిజాలు కనుగొన్నారు. స్టీవెన్ తాగే డ్రింక్స్‌లో విసీన్ అనే పేరుగల ఐ డ్రాప్స్‌ను 3 రోజులు పాటు కలిపి ఇచ్చి... లానానే హత్య చేసిందని నిర్ధరించారు. భర్త రాసిన వీలునామాను మాయం చేసి, ఆస్తి మొత్తాన్ని సొంతం చేసుకున్నట్లు గుర్తించారు.
గురువారం యార్క్ కౌంటీ న్యాయస్థానంలో తన నేరాన్ని అంగీకరించింది 53 ఏళ్ల లానా.
"నా భర్త నన్ను హింసించేవాడు. స్టీవెన్ తాగే డ్రింక్‌లో కావాలనే విసీన్ కలిపాను. అతడు అస్వస్థతకు గురికావాలనే అలా చేశా. ఐ డ్రాప్స్ కలిపిన డ్రింక్ తాగితే స్టీవెన్ చనిపోతాడని నేను అనుకోలేదు."
-లానా క్లేటన్, దోషి
న్యాయస్థానం లానాకు 25 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.
చిన్నప్పటి నుంచే...
లానా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైందని పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి ఆమె 'పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్'తో బాధపడుతోందని తెలిపారు. 2018 ఆగస్టులో దర్యాప్తు సమయంలో లానా ఆత్మహత్యకు యత్నించిందని వివరించారు.