అమెరికా గత వేసవిలో చైనాపై వేసిన 'కరెన్సీ మ్యానిపులేటర్ (కరెన్సీ విలువను అక్రమంగా మార్చే దేశం)' ముద్రను సోమవారం తొలగించింది. ఇరుదేశాల మధ్య దాదాపు రెండేళ్లపాటు సాగిన వాణిజ్య యుద్ధానికి ఓ ముగింపునకు సంకేతంగా అగ్రరాజ్యం ఈ చర్య చేపట్టింది.
డ్రాగన్ చాలా మంచిది
అమెరికా-చైనా మధ్య తొలి దఫా వాణిజ్యం ఒప్పందంపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడానికి రెండు రోజుల ముందు యూఎస్ ట్రెజరీ విభాగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. యువాన్ బలపడిందని, డ్రాగన్‌ను ఇకపై కరెన్సీ మ్యానిపులేటర్‌గా పరిగణించమని తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.
చైనా కరెన్సీ గారడీ
అమెరికా గతేడాది చైనాపై కరెన్సీ మ్యానిపులేటర్ ముద్ర వేసింది. అధ్యక్షుడు ట్రంప్.. చైనా కరెన్సీ గారడీ చేస్తోందని మండిపడ్డారు. డ్రాగన్ కరెన్సీ విలువను కావాలనే తగ్గించి.. బిలియన్ల కొద్దీ అమెరికా డాలర్లను దోచుకుంటోందని ఆరోపించారు. అమెరికా వ్యాపార అవకాశాలను, కర్మాగారాలను దెబ్బతీసేందుకు చైనా తరచూ కరెన్సీ విలువను ఉద్దేశపూర్వకంగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇది కుదరదని హెచ్చరించారు.
బలపడిన యువాన్
గత వేసవిలో చైనా యువాన్ విలువ చరిత్రలో అతి కనిష్ఠం 7.1087కి పడిపోయింది. అయితే, ఇటీవల డాలరుకు 6.93 యువాన్లకు బలపడింది. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం... కరెన్సీ సమస్యలను పరిష్కరిస్తుందని అమెరికా ట్రెజరీ విభాగం అభిప్రాయపడింది.
ఆరోగ్యకరమైన వ్యాపార పోటీని దెబ్బతీసే విధంగా.. ఇకపై కరెన్సీ విలువను తగ్గించమని చైనా అంగీకారానికి వచ్చినట్లు అమెరికా ట్రెజరీ విభాగం తెలిపింది.
ఇదీ చూడండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై దర్యాప్తునకు సీసీఐ ఆదేశం