అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో అసాధారణ ఘటన జరిగింది. హిమపాతంలో చిక్కుకున్న ఓ వృద్ధురాలు... 6 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడింది.
అసలు ఏం జరిగింది?
ఉత్తర కాలిఫోర్నియా ఓరోవిల్కు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు పౌలా బెత్ జేమ్స్ ఈనెల 9న కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేయగా.. గాలింపు చర్యలు చేపట్టారు. మంచు విపరీతంగా కురుస్తుండటం వల్ల హెలికాఫ్టర్ సాయంతో విహంగవీక్షణం చేశారు. ఓరోవిల్కు 50 కిలోమీటర్ల దూరాన ఉన్న బుట్టే మెడోస్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పౌలా ప్రయాణించిన ఎస్యూవీ కారు కనిపించింది. ప్రత్యేక వాహనంలో చేరుకున్న అధికారులు... కారులో పౌలా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అలా బతికింది...
పౌలా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. తెలియక బుట్టే మెడోస్కు కారులో వెళ్లి, మంచులో చిక్కుకుపోయింది. అయితే... ఆరు రోజులు అలానే గడిపినా ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉండడం విశేషం. కారులోని దుప్పట్లు, ఫ్లోర్ మ్యాట్లను చుట్టుకుని..., హీటర్‌ను అప్పుడప్పుడు ఆన్ చేయడం ద్వారా పౌలా చలిని తట్టుకోగలిగిందని చెప్పారు ఆమె కుటుంబసభ్యులు.
ఇదీ చూడండి: 'ఐ డ్రాప్స్'తో భర్తను హత్య చేసిన భార్య- 25ఏళ్ల శిక్ష