కశ్మీర్ అంశంలో మరోసారి మధ్యవర్తిత్వం విషయాన్ని లేవనెత్తింది అమెరికా. భారత్-పాక్‌లు కోరితే.. మధ్యవర్తిత్వం చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్య పరిపాలన విభాగం సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పై ఉందని ఉద్ఘాటించారు. భారత్-పాక్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇరు దేశాల ప్రధానులతో పలుమార్లు కశ్మీర్ అంశంపై చర్చించినట్లు గుర్తు చేశారు.
" ఇరుదేశాలు కోరినట్లయితే మధ్యవర్తిత్వం వహించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. కశ్మీర్ అంశంలో బయటివారు కలుగజేసుకోవాల్సిన అవసరం లేదన్నది భారత్ వాదన. నిర్మాణాత్మక చర్చలు చేపట్టే వాతావరణాన్ని అమెరికా ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కర్తార్‌పుర్ కారిడార్‌పై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం ఇరుదేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్య. ఇది ప్రజాసంబంధాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. "
- అమెరికా పరిపాలన విభాగం అధికారి.
చర్చలు, ఉగ్రవాదం ఒకేసారి జరగవనే భారత్ వైఖరికి అమెరికా మద్దతు ఇస్తుందా.. అని అడిగిన ప్రశ్నకు.. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం పాకిస్థాన్‌కు ఉందన్నారు. దీని ద్వారా ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం లభిస్తుందని తెలిపారు.
గతంలోనూ..
కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించారు. అయితే కశ్మీర్ అంశం పూర్తిగా భారత్, పాక్ ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చిచెప్పింది.
ఇదీ చూడండి: ' ముందస్తుకు ఒప్పుకుంటేనే బ్రెగ్జిట్ గడువు పెంచుతా'