అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధం వేదికగా ఓ పార్టీ నిర్వహించారు. సెనేట్‌లో అభిశంసన వీగిపోయిన సందర్భంగా తమ శ్రేయోభిలాషులతో కలిసి వేడుక చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులు, రిపబ్లికన్లు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారని తెలుస్తోంది. అభిశంసన వీగిపోవడం వల్ల అధ్యక్షుడు పునరుత్తేజితమయ్యారని సమాచారం.
సెనేట్‌లో న్యాయప్రక్రియ పూర్తయి విజయం సాధించిన అనంతరం.. శ్వేతసౌధ ఉద్యోగులను ఉద్దేశించి ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు ట్రంప్. కారణం లేకుండా తనపై అభియోగాలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఏ తప్పు చేయకుండానే మనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నా జీవితంలో నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. ఇది ప్రసంగం కాదు. ఒక వేడుక మాత్రమే. మన ప్రయత్నం సఫలమైంది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై ఉక్రెయిన్ దర్యాప్తు చేపట్టాలని, ఫలితంగా ఉక్రెయిన్‌కు మిలటరీ సహాయం చేస్తానని ఆ దేశ అధ్యక్షుడిపై ట్రంప్ ఒత్తిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రంప్‌పై అభియోగాలు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్ దిగువ సభ అయిన ప్రతినిధుల సభ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ చేపట్టి విజయం సాధించింది. అయితే రిపబ్లికన్లు ఎక్కువగా ఉన్న సెనేట్‌లో డెమొక్రాట్లు విజయం సాధించలేకపోయారు.
ఇదీ చూడండి: సెనేట్‌లో వీగిపోయిన అభిశంసన.. నిర్దోషిగా ట్రంప్