2050 నాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబయి సముద్రగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉన్నట్లు ఓ పరిశోధన హెచ్చరించింది. నిరంతరం పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
పెరుగుతున్న సముద్ర మట్టాలపై క్లైమేట్ సెంట్రల్‌కు చెందిన స్కాట్ ఏ కల్ప్, బెంజమిన్ హెచ్ స్ట్రాస్ చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గతంలో వేసిన అంచనాలన్నింటికంటే సముద్ర మట్టాల పెరుగుదల వల్ల మూడు రెట్లు ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని నేచర్ కమ్యునికేషన్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన హెచ్చరించింది.
ముంబయిపై ప్రభావం
ఏటా సంభవించే వరదలకు దక్షిణ ముంబయిలోని చాలా వరకు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. దీనిపై ప్రఖ్యాత వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. ముంబయి, బ్యాంకాక్, షాంఘై నగరాలు నీటమునిగే చిత్రాలను కూడా పత్రిక ప్రచురించింది.
భారత్ సహా చాలా వరకు ఆసియా దేశాలలోని హై టైడ్ లైన్(తీరంలో ఒక ఏడాది కాలంలో నమోదయ్యే అత్యంత పెద్ద ఆటుపోటు) పరిధిలో నివసించే జనాభా కూడా ఇప్పటితో పోల్చుకుంటే ఐదు నుంచి పది రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 25 కోట్ల మంది వరదల కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రాంతాలలో నివసిస్తున్నారని పరిశోధన తెలిపింది. తాజా లెక్కల ప్రకారం వంద కోట్ల మంది ప్రజలు హై టైడ్ లైన్‌కు కేవలం 10 మీటర్ల ఎత్తులో ఉంటున్నారని, 25 కోట్ల మంది కేవలం 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో ఉంటున్నారని వెల్లడించింది.
ఆసియా దేశాల్లోనే అధికం
ప్రమాదం బారిన పడే ప్రాంతాల్లోని 70 శాతం మంది ప్రజలు చైనా, బంగ్లాదేశ్, భారత్, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలలోనే ఉంటున్నట్లు తెలిపింది.
2050 నాటికి 34 కోట్ల మంది ప్రజలు వార్షిక వరదల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివాసం ఉంటారని.. ఈ శతాబ్దం చివరినాటికి ఆ సంఖ్య 63 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.