అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలన విధానాలు ... భారతీయ సాంకేతిక నిపుణులతో పాటు స్వదేశీ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు శాపంగా పరిణమిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక హెచ్ -1 బీ వీసాల తిరస్కరణ రేటు ఆరు శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 24 శాతానికి పెరిగాయి.
భారతీయ కంపెనీలే ఎక్కువ
తిరస్కరణకు గురవుతున్న హెచ్1బీ వీసాలలో 90 శాతానికి పైగా భారతీయ ఐటీ కంపెనీలవే ఉన్నాయి. భారతీయ కంపెనీల దరఖాస్తులు కనిష్టంగా 37 శాతం నుంచి గరిష్టంగా 62 శాతం తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణ రేటు టెక్ మహీంద్రాకు 41 శాతం, టాటా కన్సల్టెన్సీ సేవలకు 34 శాతం, విప్రోకు 53 శాతం, ఇన్ఫోసిస్ 45 శాతంగా ఉంది. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికమైన తిరస్కరణ అని అమెరికా థింక్-టాంక్ అధ్యయనం తెలిపింది.
అమెరికాలో పనిచేసేందుకు ఇచ్చే వర్క్ వీసాల విషయంలో అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిబంధనలను కఠినతరం చేయడమే ఈ పరిస్థితికి కారణమని అధ్యయనం వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని భారతీయ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు నాస్కామ్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఇదీ చూడండి : తిరుగుబాటుదారుల దాడులకు 15 మంది పౌరుల బలి