జనరల్ ఖాసిం సులేమానీని హత్యచేసిన అమెరికా అందుకు తగ్గ ప్రతిస్పందనను కోరుకుంటోందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ డిప్యూటీ కమాండర్, రియర్ అడ్మిరల్ అలీ ఫడావి వ్యాఖ్యానించారు. మిత్రదేశాలతో కలిసి ఇరాన్... అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రతీకారం తప్పదు
"అమెరికా ప్రతీకార చర్యలకు దిగితే, ఇరాన్ కూడా అంతే దీటుగా ప్రతిస్పందిస్తుంది."- రియర్ అడ్మిరల్ ఫడావి, బ్రాడ్‌కాస్టర్ వెబ్సైట్లో
అమెరికాపై ఇరాన్ ఏ విధమైన ప్రతీకార చర్యలు తీసుకుంటుందో మాత్రం ఫడావి వెల్లడించలేదు. కానీ ఇరాన్ ప్రతిస్పందన అమెరికా ఊహించుకోలేని విధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇరాక్‌లోని బాగ్దాద్ విమానాశ్రయం నుంచి తన కాన్వాయ్‌లో బయలుదేరిన కుర్ద్ఫోర్స్ జనరల్ సులేమానీని.. యూఎస్ డ్రోన్ క్షిపణులతో దాడి చేసి చంపిందని రివల్యూషనరీ గార్డ్స్ ధ్రువీకరించింది.
యూఎస్ తరహా దౌత్యం
సులేమానినీ హతమార్చిన తరువాత అమెరికా.. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్యలకు ప్రయత్నిస్తోందని రియర్ అడ్మిరల్ ఫడావి ఆ దేశ జాతీయ టీవీ ద్వారా వెల్లడించారు.
ఇంతకు ముందు ఇరాన్ విదేశాంగమంత్రి మొహమ్మద్ జావెద్ జరీఫ్, అమెరికా తరఫున రాయబారానికి ప్రయత్నించిన స్విట్జర్లాండ్‌ను తీవ్రంగా విమర్శించారు. స్విస్ అమెరికా తరఫున ఓ అవివేక సందేశాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య నాలుగు దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు లేకపోవడం.... తాజాగా ఇరాన్ రెండో అత్యున్నత నేత సులేమానీని యూఎస్ హతమార్చిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: మండుతున్న సూర్యుడిని తలపిస్తోన్న ఆస్ట్రేలియా