యూరోపియన్ పార్లమెంట్ (ఎమ్ఈపీ) ప్రతినిధి బృందం ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్‌ను సందర్శించింది. ఐక్యరాజ్యసమితి సంస్కరణ, శాంతి పరిరక్షణ, మానవహక్కులు, నిరాయుధీకరణ, వాతావరణ సమస్యలు సహా పలు అంశాలపై భారత అధికారులతో చర్చించింది. ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న ఈయూ-భారత్‌లు పరస్పర సహకారంతో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించాయి.
ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరుపక్షాలు గంటపాటు చర్చించాయి. ఎమ్ఈపీ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషకరమని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. చట్టసభ్యులు అధికారిక ఈయూ ప్రతినిధులేనా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఐరోపా పార్లమెంట్‌లోని 5 వేర్వేరు బృందాలకు చెందిన.. 10 దేశాల నుంచి ఈ ఎమ్ఈపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు' అని స్పష్టతనిచ్చారు.
ఐరాసలోని భారత్ శాశ్వత మిషన్‌తో జరిపిన చర్చల్లో ఐరోపా పార్లమెంట్‌కు చెందిన రక్షణ, మానవహక్కులు, విదేశీ సంబంధాల కమిటీలు కూడా ఉన్నాయి.
కశ్మీర్లో ఈయూ ఎంపీల బృందం పర్యటన
ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి బృందంతో.. ఈయూ పార్లమెంట్ సభ్యులు చర్చలు జరుపుతున్న సమయంలోనే.. జమ్ముకశ్మీర్‌లో 23 మంది ఈయూ ఎంపీల బృందం పర్యటించింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను ఈ బృందం పరిశీలిస్తోంది.
లోయలో మానవహక్కులకు భంగం కలుగుతోందని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఈయూ ఎంపీల బృందాన్ని కశ్మీర్లో పర్యటించడానికి అనుమతినిచ్చింది.
ఇదీ చూడండి: నెగ్గిన బోరిస్ ప్రతిపాదన.. డిసెంబర్ 12నే బ్రిటన్ ఎన్నికలు