అది ఆస్ట్రేలియాలోని ఓ పెద్ద ఎడారి. తినటానికి తిండి, కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకవు. ఉండటానికి నీడ, కప్పుకునేందుకు గుడ్డా ఉండవు. రాత్రిళ్లు పురుగు, పుట్రల భయం. అలాంటి భయానకమైన దుర్భర బతుకును క్షణమైనా ఊహించుకోలేం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ వ్యక్తి 13 రోజుల పాటు జీవించి ఎట్టకేలకు బయట పడ్డాడు.
ఇదీ జరిగింది..
వివరాల్లోకి వెళ్తే.. అలీస్ స్ప్రింగ్స్ నగరానికి చెందిన ఫూ ట్రాన్' సహా మరో ఇద్దరు స్నేహితులు ఎడారి ప్రయాణానికి బయల్దేరారు. అకస్మాత్తుగా దారి మధ్యలో వారి కారు బురదగుంతలో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి ఎటువెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డారు. బయటపడే మార్గాన్ని వెతికే ప్రయత్నంలో తలోదారిన వెళ్లి.. ఒకరితో ఒకరు సంబంధాలు కోల్పోయారు. కనీసం గొంతు తడుపుకోవడానికి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
ఇలా దొరికాడు..
13 రోజులపాటు ఎడారివాసం చేసిన ట్రాన్... ఓ పశువుల కాపరికి దీనమైన స్థితిలో కంటపడ్డాడు. ఆ కాపరి పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి అతడిని రక్షించారు. అనంతరం.. ట్రాన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
"ట్రాన్ అదృష్టం కొద్దీ ఇక్కడికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. వేరే ఏ దారి గుండా ప్రయాణించినా.. మరో 20 కిలోమీటర్ల వరకు నీరు దొరకడం కష్టం."
- పశువుల కాపరి.
కొద్దిపాటి నీరు తాగి..
ఎడారిలో దిక్కుతోచని స్థితిలో వెళ్తుండగా కనిపించిన కొద్ది పాటి నీరు తాగి కడుపు నింపుకున్నట్లు చెప్పుకొచ్చాడు ట్రాన్.
రెండ రోజుల క్రితమే ఒకరు..
ముగ్గురిలో ఒకరైన తామ్రా మెక్‌బీత్-రిలే అనే మహిళ ఆచూకీ.. వారి కారు చిక్కుకుపోయిన సమీపంలోనే ఆదివారం లభ్యమైంది. డీ హైడ్రేషన్‌కు లోనైన ఆమె కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఎడారి యాత్రకు వెళ్లిన ముగ్గురిలో ఇప్పటికి ఇద్దరి ఆచూకీ దొరకగా.. మరో వ్యక్తి కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు.
ఇదీ చూడండి : టెలికాం సంస్థకు చుక్కలు.. 24వేల సార్లు ఫోన్లో ఫిర్యాదు