ప్రపంచ ఖ్యాతిగాంచేలా మహాదివ్య పుణ్యక్షేత్రంగా యాదాద్రి పంచనారసింహుల సన్నిధిని తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన తీరులో యాదాద్రి క్షేత్రాన్ని రూపొందించాలని యాడా నడుం బిగించింది. తరతరాలకు నిలిచిపోయేలా ఆలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం సూచించిన నేపథ్యంలో ప్రణాళికల రూపకల్పనకు సన్నాహాలు మొదలయ్యాయి.
సకల సౌకర్యాలకు ప్రణాళిక సిద్ధం
మహా పుణ్యక్షేత్రం యాదాద్రి కొండ కింద భక్తులకు సకల సౌకర్యాలు సమకూర్చడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పుష్కరిణి, కల్యాణ కట్ట, నిత్య అన్నదాన కేంద్రం, శివాలయం, యాగశాల అన్నీ వాస్తు ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయి.
యాగశాలకు 100 ఎకరాలు సేకరణ
గండిచెరువును సుందరీకరించి ఆహ్లాదకరంగా అభివృద్ధి చేస్తున్నారు. కొండ చుట్టూ రింగ్‌రోడ్డు పనులు వేగవంతమయ్యాయి. సుదర్శన యాగం కోసం యాగశాల నిర్మాణానికి అవసరమైన 100 ఎకరాల స్థలం సేకరించినట్లు ఆలయ అధికారి గీతా తెలిపారు.
రెండు నెలల్లో పనులు పూర్తి
"మరో రెండు నెలల్లో కొండపైన యాదాద్రి ప్రధాన ఆలయం, శివాలయ నిర్మాణం, ప్రసాదాల తయారీ విక్రయ కేంద్రాలు, భక్తుల దర్శన సముదాయాలు, విష్ణు పుష్కరిణి పనులు పూర్తి అవుతాయి"
భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన అనంతరమే మహా సుదర్శన యాగం ఉంటుందని ఈఓ గీత తెలిపారు. యాగ స్థలాన్ని చిన జీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ త్వరలో పరిశీలిస్తారని వివరించారు.