మిడ్ మానేరు, మధ్యమానేరులో నీటి నిల్వలు పెరగడం వల్ల ఈ ప్రాంతానికి పట్టిన కరవు తొలగిపోయిందని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిడ్ మానేరు సందర్శించిన అనంతరం కరీంనగర్‌లోని తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. మిడ్ మానేరుకు ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా 60 టీఎంసీల నీరు కాళేశ్వరం నుంచి ఎత్తిపోశాం అని తెలిపారు. దీని ద్వారా అద్భుత నీటి లభ్యత పెరిగిందన్నారు.
మిడ్‌మానేరు దిగువ ఆయకట్టుకు రెండు పంటలకు నీరు అందుతుందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. గతంలో జీవనది గోదావరి ప్రవహించే ప్రాంతంలో నీటి సమస్య ఉండేదన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు వద్ద పూజ చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందని.. జీవితంలో గొప్ప సాఫల్యత సాధించినట్లు అనిపించిందని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి పట్ల తమకు అంకిత భావం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని 1230 చెక్‌డ్యాంలకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు పేర్కొన్న సీఎం అందులో సింహభాగం కరీంనగర్ జిల్లాకే చెందాయన్నారు. రూ.1250 కోట్లు నిధులు కరీంనగర్ జిల్లాకే వచ్చినట్లు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ కల్లా పనులు పూర్తై నీటితో చెక్‌డ్యాంలన్నీ నిండాలని అధికారులను ఆదేశించారు.