నాటి సభలో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఇంకా ఏమన్నారు? సభలో ఏం జరిగింది?
శాసనమండలి సభ్యులు వివిధ అంశాలపై మంచి అవగాహన పెంపొందించుకోవాలని మండలిలో తగు విధమైన చర్చల ద్వారా ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు. 2007 ఏప్రిల్ 2న హైదరాబాద్‌లోని జూబ్లీహాలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘'‘రాష్ట్ర చరిత్రలో శాసనమండలి ఏర్పాటు చరిత్రాత్మక దినం. రాష్ట్ర వైశాల్యం, జనాభా కొన్ని ఐరోపా దేశాల కంటే ఎక్కువ. కానీ శాసనసభ ఒక్కటే కావటంతో ప్రధాన విషయాలపైన కూడా సమగ్రంగా చర్చించకుండానే ఆమోదించాల్సి వస్తోంది. శాసనమండలిలో తగు చర్చ జరిపితే శాసనసభకు ఊతం ఇచ్చినట్లవుతుంది. మండలి సభ్యులు పోడియం వద్దకు వచ్చిన చరిత్ర లేదు. తమ చర్చలతో ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించేలా సభ్యులు వ్యవహరించాలి'’’ అని నాడు వైఎస్ పేర్కొన్నారు.
గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ మాట్లాడుతూ... ‘'‘ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో ఎగువ సభకు మంచి ప్రాధాన్యం ఉంది. చాలా దేశాల్లో ఎగువసభ కీలకపాత్ర పోషిస్తోంది. బ్రిటన్‌లో హౌస్ ఆఫ్ లార్డ్స్, అమెరికాలో సెనేట్, భారత్‌లో రాజ్యసభ సభ్యులు తమ అమితమైన జ్ఞానంతో చర్చలు జరిపి చట్టాలు రూపొందించడానికి దోహదపడ్డారు’'’ అని ఆయన కొనియాడారు. అప్పటి శాసనసభ స్పీకర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 'ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే శాసనమండలిని పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. మండలి సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి సమయం ఎక్కువ ఉంటుందని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాసనసభ కమిటీల్లో ఎమ్మెల్సీలనూ సభ్యులుగా నియమిస్తామని.. ఆ కమిటీల్లో చురుకైన పాత్ర పోషించాలని కోరారు'. ఆర్థికమంత్రి రోశయ్య మాట్లాడుతూ.. శాసనమండలితో తనకు విడదీయలేని ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. కీలకమైన తొలి పాఠాన్ని తాను మండలిలోనే నేర్చుకున్నానని.. దాని పునరుద్ధరణ పట్ల అనిర్వచనీయ ఆనందాన్ని పొందుతున్నానని తెలిపారు.
ఇవీ చూడండి: రోడ్డుపైనే కొట్టుకున్న కాంగ్రెస్, భాజపా నేతలు