సరుకు రవాణా రంగంలోకి అడుగుపెడుతున్న ఆర్టీసీ... దానికి తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రవాణా నిర్వహణకు కొత్తగా 1,209 మంది సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్డర్లు తీసుకువచ్చేందుకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను, వాహనాలు నడిపేందుకు డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
బస్ భవన్, కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్లో నలుగురు సీనియర్ స్కేల్ అధికారులను, 11 రీజియన్లలో జూనియర్ స్కేల్ అధికారులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీరితోపాటు 11 రీజియన్లలోని 97 డిపోల్లో ఒక్కో డిపోకు ఒక్కో కంప్యూటర్ ఆపరేటర్ నియామకం చేయడంతో పాటు అదనంగా మరో 15 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం కోసం కనీస అర్హతగా డిగ్రీ నిర్ణయించారు. ఈ అర్హతలు ఉన్న కండక్టర్లను కూడా తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రూ.400 కోట్లు లక్ష్యం..
గ్రేటర్ పరిధిలో ఇప్పటికే వెయ్యి బస్సులు రద్దు చేయాలని నిర్ణయించినందున... వాటికి సంబంధించిన డ్రైవర్లు, కండక్టర్ల సేవలు రవాణాకు వినియోగించుకోనున్నారు. బస్ భవన్లో సూపర్వైజర్లు, అకౌంటెట్లను, మరో 1,069 మంది డ్రైవర్లను 822 సరకు రవాణా ట్రక్కుల కోసం నియమించనున్నారు. వీలైనంత త్వరగా నియామకాలు చేసి... ఏడాదికి కనీసం 400కోట్ల రూపాయలను ఆర్జించాలని అధికాలు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: 'మలి'జోడు: ఒంటరి మనసులు ఒక్కటైన వేళ!