గ్యారేజీలో వైద్యం చేయించుకుంటున్న బస్సులు...
ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 55 రోజుల పాటు చేసిన సమ్మెతో చాలా బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరండి అని పిలుపునివ్వడం వల్ల ఒక్కసారిగా కార్మికులు విధుల్లో చేరిపోయారు. అయితే డ్రైవర్లు నడపాలనుకున్నా.. బస్సులే అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పటికీ పదిశాతం బస్సులకు ఇంకా మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయిని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో రోజుకు 3,500ల బస్సులు 9.70 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సులు నిత్యం 33లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చుతుంటాయి.
సమ్మె కాలంలో గ్రేటర్ పరిధిలోని బస్సుల్లో కేవలం 50శాతం మాత్రమే తిరిగాయని అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. ఇక తిరిగిన 50శాతం బస్సుల్లో ఎక్కువశాతం బస్సులను తిప్పింది అనుభవంలేని డ్రైవర్లు కావడం వల్ల ఇష్టారాజ్యంగా బస్సులను నడిపారు. దీంతో ఆ బస్సులకు సంబంధించిన గేర్‌బాక్స్‌లు, క్లచ్‌లు దెబ్బతిన్నాయి. ఒక్కో బస్సుకు ఒక్కోరకమైన గేర్ చెడిపోయి.. వాటిని స్టోర్ నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్నింటి బస్సులకు అద్దాలు పగిలిపోవడం, బాడీ దెబ్బతినడం జరిగింది. చాలా రోజులు నడపకపోవడం వల్ల బ్యాటరీలు డిస్చార్జి అయ్యాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 డిపోల పరిధిలో 668 బస్సులు ఉన్నాయి. ఇందులో రెండు వందలకు పైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఒక్క మంథని డిపోలోనే 54కు సుమారు 20 బస్సులు దెబ్బతిన్నాయి. సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు ఇష్టానుసారం నడపడం వల్ల.. కనీస నిర్వహణ లేక బస్సులు పాడయ్యాయని కార్మికులు చెబుతున్నారు.
సమ్మెకాలంలో మరమ్మతులు జరగలేదు...
బస్సుల కండీషన్‌ను ప్రతిరోజు చూడాల్సి ఉంటుంది. టైర్లు, జాయింట్లు ,రేడియేటర్లు, స్ప్రింగులు, ఆయిల్ సీల్లు, లీకేజీలు పరిశీలించాలి. బస్సులకు గ్రీసింగ్ చేయడం వంటివి ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు వారానికి ఒకసారి శుభ్రపరచాలి. సమ్మె కాలంలో వీటి నిర్వహణ తప్పి నిర్దిష్టంగా జరగాల్సిన పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదని మెకానిక్‌లు తెలిపారు. గ్యారేజ్‌లో తాత్కాలిక విధులు నిర్వహించిన కార్మికులు చేతి వాటం ప్రదర్శించి, సంస్థ పనిముట్లను ఎత్తుకెళ్లారని ఉద్యోగులు వాపోయారు.
బస్సుల మరమ్మత్తులు యుద్దప్రాతిపదికన చేయిస్తున్నామని... అధికారులు పేర్కొంటున్నారు. ఐతే.. వాటి రిపేర్లకు సంబంధించిన పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్లే రిపేర్లు ఆలస్యమవుతున్నాయంటున్నారు.
ఇవీ చూడండి: 'తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం'