మున్సిపాల్టీ ఎన్నికల్లో వ్యూహాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ సుదీర్ఘ కసరత్తు చేశారు. తెలంగాణ భవన్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిరంతరాయంగా... పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా చర్చలు జరిపారు. కార్పొరేషన్లు, పురపాలక సంఘాల వారీగా దాఖలైన నామినేషన్లు.. ఇతర పార్టీల అభ్యర్థుల బలాబలాలపై కేటీఆర్ ఆరా తీశారు.
రెండు రోజుల్లో పూర్తి చేయండి
చాలా ప్రాంతాల్లో తెరాస అభ్యర్థులకు... సొంత పార్టీ రెబల్స్ నుంచే పోటీ కనిపిస్తోందని నేతలు చెప్పారు. రెబల్స్‌ను బుజ్జగించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులే బరిలో ఉండాలన్నారు. నామినేటెడ్ పదవులు, ఇంకా అనేక అవకాశాలు ఉంటాయని అసంతృప్త నాయకులకు వివరించాలన్నారు. ఎంత చెప్పినా... వినకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని.. పార్టీ నుంచి వేటు వేయడానికి వెనకాడేది లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రెండు రోజుల్లో బుజ్జగింపులు పూర్తి చేసి... బీ ఫారాల దాఖలు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు.
విజయం మనదే
నామినేషన్ల ఘట్టం ముగిసినందున... ఇక ప్రచారంపై దృష్టి సారించాలని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అజెండాగా ప్రచారంలో దూసుకెళ్లాలన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి.. ప్రజలందరినీ కలవాలని చెప్పారు. అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా పది రోజులు కష్ట పడాలని కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు లేని ప్రాంతాల ఎమ్మెల్యేలకు... సమీపంలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల బాధ్యత అప్పగించారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: గులాబీ తోటలో వికసించేందుకు కమలనాథుల వ్యూహాలు...