రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని బండ్లగూడ శారదానగర్‌లో నివాసం ఉండే గోవర్ధన్‌రెడ్డి స్టీల్, సిమెంట్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఎప్పటిలాగే రూ.25లక్షలు ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టాడు. ఆ ఇంట్లో కాపలాదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కింది అంతస్తులో నివాసం ఉంటున్నాడు.
అప్పుడప్పుడూ తల్లివెంట వెళుతూ...
కాపలాదారు భార్య గోవర్థన్‌రెడ్డి ఇంట్లో పనిమనిషి. అయితే వారి కుమారుడు(16) అప్పుడప్పుడు తల్లి వెంట యజమాని ఇంట్లోకి వెళ్లేవాడు. ఇలా వారి ఇంట్లో వస్తువులు, నగదు ఎక్కడ పెడతారనే విషయం పూర్తిగా అతనికి తెలుసుకున్నాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో....
ఈ నేపథ్యంలో వారంరోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాలో ఉన్న నగదు తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడినుంచి అతని బాబాయ్ దగ్గరకు వెళ్లి ఇచ్చాడు. ఈ నెల 8న బీరువా తెరిచేందుకు యజమాని ప్రయత్నించగా తాళంచెవి కనిపించలేదు. అనుమానంతో బీరువాను పగలగొట్టి చూడగా అందులో నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు.
చివరికి కటకటాలపాలు...
రాజేంద్రనగర్ ఠాణాలో నగదు పోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనుమానంతో కాపాలదారు కుమారుడిని విచారించగా నగదు దొంగలించినట్లు తేలింది. అతని వద్ద నుంచి రూ.24.70 లక్షలు స్వాధీనం చేసుకొని నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.