అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో అన్నదాతల ఆందోళనలు తొమ్మిదో రోజూ మిన్నంటాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల వైకాపా నేతలు చేసిన ప్రకటనతో మందడంలో గురువారం నిరసన చేస్తున్న రైతుల్లో ఆవేశం కట్టలుతెంచుకుంది. మందడంలో మహాధర్నాను రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగించారు. పోలీసులు బలవంతంగా 2 టెంట్లను తొలగించినా మరో 2టెంట్ల కింద రైతులు, మహిళలు పెద్దఎత్తున బైఠాయించి... రక్తాన్నైనా చిందిస్తాం అమరావతిని సాధిస్తాం అంటూ జాతీయ జెండాలు పట్టుకుని నినదించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను నిరసిస్తూ రహదారులపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. వివిధ గ్రామాల్లో రహదారి పొడవునా టైర్లు తగలపెట్టారు. రాత్రి పొద్దుపోయాక రైతులు కూర్చుండగానే టెంట్ తాడులు పోలీసులు కోయించివేశారు. గ్రామస్థులు, మహిళలపై టెంటు పడింది. పోలీసులు టెంట్ తొలగించిన తర్వాతా కొందరు రైతులు పరదాలపైనా పడుకుని నిరసనలు కొనసాగించారు. కొందరు క్యారమ్స్ ఆడుతూ నిరసనలు తెలిపారు.
ఎమ్మెల్యే ఆర్కే ఇంటికి వినతిపత్రం
రాజధాని రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా సచివాలయం చుట్టు పక్కల గ్రామాల యువత గురువారం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. మందడం, మల్కాపురం, వెలగపూడి గ్రామాల్లో బైక్ ర్యాలీ చేశారు. ట్రాక్టర్‌పై ర్యాలీగా వెళ్తున్న మహిళలను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. నిన్న సాయంత్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇంటికి చేరుకున్న అమరావతి అఖిలపక్షం నేతలు, రైతులు ఆయన ఇంటికి వినతిపత్రాన్ని అంటించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని అందులో కోరారు.
నేడు కొనసాగనున్న ఆందోళనలు
నేడు ఉద్ధండరాయుని పాలెంలో 29 గ్రామాల ప్రజలు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇతర ముఖ్యనేతలు అక్కడే మౌనదీక్ష చేపట్టనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెం గ్రామాల్లో పదో రోజూ రైతులు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు.
ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!