తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన చట్టంలోని అంశాలు సహా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి ధర్మాధికారి కమిటీ తుది నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానిపై చర్చించే అవకాశం ఉంది. ఏపీకి చెందిన 650మంది విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ రిలీవ్ చేసినా ఏపీ వారిని ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
నదీజలాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వివాదాస్పదమవుతోన్న నేపథ్యంలో ఆ విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇతర సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.