రాష్ట్రంలోని చెరువులు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని చాలావరకు చెరువులు నిండిపోయాయి. సగానికిపైగా చెరువులు మత్తడులు పోస్తున్నాయి. పలు చెరువులకు బుంగలు పడగా.. కొన్ని చోట్ల కట్టలు తెగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43,412 జలాశయాల్లో 39,301 చెరువులు 75శాతం కంటే ఎక్కువ నీటితో నిండిపోయాయి. 24,149 చెరువులు మత్తడులు పోయడాన్నిబట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కృష్ణా పరీవాహక ప్రాంతంలో
* సంగారెడ్డి సర్కిల్ పరిధిలోని చెరువులు అత్యధికంగా నిండాయి. మొత్తం 8,782 చెరువులకు గాను 3,017 పూర్తిగా నిండగా.. 5,340 మత్తడులు దాటి పారుతున్నాయి.
* మహబూబ్‌నగర్ సర్కిల్ 6,419 చెరువులకుగాను 323 పూర్తిగా నిండగా.. 5,402 మత్తడులు దుంకుతున్నాయి.
* రంగారెడ్డి సర్కిల్‌లో 3,646 చెరువుల్లో 2,334 చెరువుల్లో నీరు మత్తడులపై నుంచి ప్రవహిస్తోంది.
* నల్గొండ సర్కిల్‌లో 4,454 చెరువులకు 2,513 మత్తడులు పోస్తున్నాయి.
గోదావరి పరీవాహక ప్రాంతంలో..
* వరంగల్ సర్కిల్‌లో చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. 6,030 చెరువులకుగాను 25 శాతం లోపు నిండిన చెరువులు 7, 25-75 శాతం లోపు నిండిన చెరువులు 2 ఉండగా.. 75-100 శాతం నిండిన చెరువులు 3,127 ఉండటం విశేషం. మిగిలిన 2,804 చెరువులు మత్తడులు దూకి ప్రవహిస్తున్నాయి.
* కరీంనగర్ సర్కిల్‌లో 4,290 చెరువులకు 2,895, నిర్మల్ సర్కిల్‌లో 715/2,702, ఖమ్మం సర్కిల్‌లో 1706/3,882, నిజామాబాద్ సర్కిల్‌లో 440/3,206 చెరువులు మత్తడులు దాటాయి.