కార్పొరేషన్లు, పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. పురపోరుకు 21,850 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటిరోజు కేవలం 967 నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు 4,772, చివరి రోజైన ఇవాళ ఏకంగా 15 వేల వరకు నామపత్రాలు దాఖలయ్యాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392 నామినేషన్లు వచ్చాయి. 1,910 నామినేషన్లతో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా రెండో స్థానంలో ఉంది. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 134 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు రేపు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 14 వరకు గడువు ఉంది. 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఫలితాలు వెలువడనున్నాయి. బీ ఫారాల విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు బీ ఫారాలు ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈనెల 14న మధ్యాహ్నం 3 వరకు బీ ఫారాలు సమర్పించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.