రేపట్నుంచి హైదరాబాద్ రైతుబజార్లలో 40 రూపాయలకే కిలో ఉల్లిగడ్డ లభించనుంది. వ్యాపారుల నుంచి ఉల్లిని కొనుగోలు చేసి.. మార్కెటింగ్ శాఖ ప్రజలకు అందించనుంది. మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు మలక్ పేటలో ఉల్లి వ్యాపారులతో మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, సంచాలకులు లక్ష్మీబాయి చర్చలు జరిపారు. హమాలీ, రవాణా ఛార్జీలను ప్రభుత్వం భరించి, వినియోగదారులకు 40 రూపాయలకే కిలో చొప్పున అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు మెహిదీపట్నం, సరూర్ నగర్ రైతుబజార్లలో రేపు సాయంత్రం ఉల్లి విక్రయ కేంద్రాలను అధికారులు ప్రారంభించనున్నారు.
ఒకరికి ఒక కిలో మాత్రమే..
ఒక వినియోగదారునికి ఒక కిలో చొప్పున ఉల్లి విక్రయిస్తారు. ఇందుకోసం రోజుకు రెండు టన్నుల ఉల్లి అందుబాటులో ఉంచుతారు. దశలవారీగా ఇతర రైతుబజార్లలోనూ ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉల్లిధరల పెరుగుదల నేపథ్యంలో ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇతర దేశాలకు ఎగుమతులు నిలిపివేసిన కేంద్రప్రభుత్వం ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలలో తెలంగాణకు కూడా కొంత కేటాయించేలా కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు.
ఇవీచూడండి: కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు