తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ ముగిసింది. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో 6 గంటలకు పైగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని కేసీఆర్, జగన్ నిర్ణయించారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించడంపై సుదీర్ఘ చర్చించారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించడంపై భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు.
గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలని నిర్ణయించారు. తక్కువ సమయం, ఖర్చుతో గోదావరి నీళ్లు తరలించవచ్చని పేర్కొన్నారు. తద్వారా పాలమూరు, నల్గొండ, రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గోదావరి జలాల తరలింపుపై తదుపరి భేటీలో చర్చించాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల అంశాలతో పాటు దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సహృద్భావ వాతావరణంలో పరస్పర సహకార స్ఫూర్తితో సమావేశం జరిగింది.
‘‘విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్లోని పలు అంశాలపై అనవసర పంచాయితీ ఉంది. దీన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం కాదు’’ అని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు
సమావేశం నుంచే ఇద్దరు ముఖ్యమంత్రులు... రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. 9, 10 వ షెడ్యూళ్లలోని అంశాలను పరిష్కరించుకునే దిశలో త్వరలోనే సమావేశం కావాలని ఆదేశించారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.