మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక నియంత్రణపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థికశాఖ అధికారులు నివేదించారు. అన్ని శాఖల్లోనూ ఆర్థిక నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సీఎం ఆదేశించారు.
లోకాయుక్త చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాబార్డ్ నుంచి రూ.1500 కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.14,075 కోట్ల రుణానికి అంగీకారం తెలిపింది. దుమ్ముగూడెం వద్ద కొత్త ఆనకట్ట నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి మధ్యమానేరు జలాశయానికి అదనంగా 1.1 టీఎంసీ నీటి ఎత్తిపోత పనులకు అంగీకారం తెలిపింది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో లులూ గ్రూప్‌నకు లీజు పద్ధతిన భూమి కేటాయించాలని నిర్ణయించింది.