పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణకు ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు అయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసారు. జీవో.111 పరిధిలో బినామీ పేరుతో రాజమహల్ కట్టుకున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆ జీవో పరిధి నుంచి కొన్ని గ్రామాలు మినహాయింపు ఆలోచన వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో 111 సమీక్షిస్తామంటున్నారని విమర్శించారు.
పుప్పాలగూడలో రూ. 30కోట్ల విలువ చేసే ఆస్తిని కోటికే ఎలా కొన్నారని నిలదీశారు. 2014లో రూ.8కోట్ల ఉన్న కేటీఆర్ ఆస్తి... 2018కి రూ.41కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏంటని ప్రశ్నించారు. తెరాస విరాళాలు 188కోట్ల రూపాయలకు పెరగడం వెనుక రాజకోట రహస్యమేంటని ప్రశ్నించారు. రాష్ట్రం 3లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే మీరు మాత్రం వేలకోట్లకు అధిపతులయ్యారని సీఎంనుద్దేశించి ఆరోపించారు. గచ్చిబౌలి, కోకాపేటల్లో వందల ఎకరాలు ఎలా వారి సొంతమయ్యాయన్నారు. కేటీఆర్ అవినీతి బాగోతాలపై త్వరలో సమగ్ర వివరాలు, ఆధారాలతో పుస్తకం వేస్తామని లేఖలో వివరించారు.
ఇదీ చూడండి: ప్రతి ఉద్యోగి సూపర్ యాన్యుయేషన్ గురించి తెలుసుకోవాల్సిందే!