రాష్ట్రంలో విద్యా శాఖలో ఐదేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ ఐకాస నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో విద్యా శాఖ డైరెక్టరేట్‌లో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో ఉపాధ్యాయ ఐకాస, జాక్టో నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల పదోన్నతులు, కొత్త నియామకాలు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల స్థానం భర్తీ చేయకపోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
వేధిస్తున్నారు.. చర్యలు తీసుకోండి..
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20 డీఈఓ, 150 సహాయ డీఈఓ, 45 ఎంఈఓ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి పలువురు ఉపాధ్యాయులపై కక్ష కట్టి వేధిస్తున్నారని ఐకాస నేతలు ఫిర్యాదు చేశారు. మొత్తం 14 రకాల అంశాలతో కూడిన వినతిపత్రాలను సబితా ఇంద్రారెడ్డికి అందజేశారు. ఐకాస నేతలు ప్రస్తావించిన అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి వద్ద దస్త్రం ఉన్న దృష్ట్యా... త్వరలో పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.