ప్రతి కప్పు.. ప్రతి ప్లేటు ప్లాస్టిక్ ఫ్రీనే...
హైదరాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న పలు వ్యాపార కంపెనీలకు జరిమానాలు విధించింది. ప్లాస్టిక్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగానే వీధి వ్యాపారుల కోసం రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన స్టాళ్లను అందించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన నిర్ణయం తీసుకున్నారు. ఛాయ్ నుంచి మొదలుకొంటే టిఫిన్, జ్యూస్, భోజనం లాంటి విక్రయాలు ఏవైనా అక్కడ చేసుకోవచ్చు. టీ కప్పులు, గ్లాసులు, పళ్లాలు అన్నీ పర్యావరణహితంగా ఉండనున్నాయి. మొక్కజొన్న, అరటి ఆకులు, వెదురు లేదా స్టీల్ ప్లేట్లను మాత్రమే వాడనున్నారు.
ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు...?
హైటెక్ సిటీ శిల్పారామం ఎదురుగా అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్ సమీపంలో రోడ్డు పక్కనే ఖాళీగా స్థలంలో 55 స్టాళ్లతో ఈ జోన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ స్టాళ్ల ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత వీధి వ్యాపారుల ప్రాంతంగా పిలువనున్నారు. హైటెక్ సిటీలో ప్రధాన రహదారులు, పాదబాటలను ఆక్రమించి తోపుడు బండ్లను, ఫుడ్ కోర్టులు, టీ, జ్యూస్ సెంటర్లను నిర్వహిస్తున్న వారందరినీ ఖాళీ చేయించి మరో 10-15 రోజుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
స్టాళ్లను తయారు చేసిన గుజరాత్ సంస్థ...
వాడి పారేసిన ప్లాస్టిక్ సీసాలు.. సంచులను రీసైకిల్ చేసి వీటిని తయారు చేశారు. గుజరాత్‌కు చెందిన ఓ సంస్థకు నిర్మాణ బాధ్యతలను జీహెచ్ఎంసీ అప్పగించింది. ఒక్కో స్టాల్ తయారీకి దాదాపు 2 వేల ప్లాస్టిక్ సీసాలను రీసైకిల్ చేశారు. ఆరున్నర అడుగుల ఎత్తు, ఆరున్నర అడుగుల వెడల్పు సైజులో 45 పెద్దవి, మూడున్నర అడుగుల ఎత్తు, మూడున్నర అడుగుల వెడల్పులో 10 చిన్న స్టాళ్లను తయారు చేస్తున్నారు.
చిరు వ్యాపారులకు తొలిసారి ఫసాయ్ సర్టిఫికేట్లు
ఒక్కో స్టాల్ ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ 90 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. 800 మీటర్ల విస్తీర్ణంలో వీటిని వరుసగా ఏర్పాటు చేస్తున్నారు. 40 టన్నుల ప్లాస్టిక్ రీసైకిల్ చేసి వీటిని తయారు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్(ఫసాయ్) ఆధ్వర్యంలో క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీరికి ఫసాయ్ గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వనున్నారు.
ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత హైదరాబాద్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడికి ప్లాస్టిక్‌పై, ప్రకృతిపై సరైన అవగాహన కలిగినప్పుడే పర్యావరణం బాగుపడుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు.