హైదరాబాద్‌లో ఆదివారమైందంటే ఎక్కడో ఓ చోట.. ఏదో ఒక పరుగు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అది ఆరోగ్యం కోసం కావొచ్చు... లేదంటే సామాజికం కోసం కావొచ్చు. కానీ ఈ రోజు నెక్లెస్ రోడ్ వేదికగా ఓ వినూత్న పరుగు జరిగింది. మహిళల ఫిట్‌నెస్‌కు సంబంధించి 'శారీరన్' నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళలు.. వారికి మద్దతు పలుకుతూ పురుషులు పరుగులో పాల్గొన్నారు.
తనైరా, పింకథాన్ ఆధ్వర్యంలో మూడో ఎడిషన్ శారీ రన్‌ను మొదటిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించారు. నెక్లెస్ రోడ్ నుంచి జలవిహార్ వరకు నిర్వహించిన పరుగు పోటీలో దాదాపు 300 మంది మహిళలు చీరలతో వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ఫిట్నెస్, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ ప్రారంభించారు. ఈ శారీ రన్‌కు మద్దతుగా ఆయన పంచె ధరించి పరుగులో పాల్గొన్నారు.
"మహిళలు ఫిట్‌గా ఉండేందుకు ప్రోత్సహించడమే ఈ రన్ లక్ష్యం. అదే సమయంలో తమకు సౌకర్యవంతమైన రీతిలోనే ఫిట్నెస్ను పొందవచ్చు. ప్రతి భారతీయ మహిళకు చీరతో విడదీయరాని అనుబంధం ఉంది. మహిళా సాధికారతతో ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన దేశం...ప్రపంచం తయారవుతుంది."
-మిలింద్ సోమన్, నటుడు
'డోంట్ హోల్డ్ బ్యాక్' అన్న నినాదంతో ఈ శారీరన్ను ప్రారంభించారు నిర్వాహకులు. మహిళలకు చీరకట్టు వల్ల ఎలాంటి అసౌకర్యం ఉండదని.. పరుగు పోటీల్లో కూడా పాల్గొనవచ్చని నిరూపించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.