రాష్ట్రంలో 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కేబినెట్ నిర్ణయం పలు చట్టాలతో పాటు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు వ్యాజ్యం దాఖలు చేశారు.
కార్మికులతో చర్చలు జరపకుండా... ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. హైకోర్టు కోరినప్పటికీ.. ప్రభుత్వం ఫలప్రదమైన చర్చలు జరపకుండా ప్రైవేటీకరణకు మొగ్గు చూపారని ఆరోపించారు. ప్రైవేటీకరణ చర్యలు నిలిపివేసి.. సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చర్చలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, కార్మిక శాఖ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మిగతా పిటిషన్లతో కలిపి హైకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది.