ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నందున... నేతలు తమ రోజువారీ విధుల నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో విధులు నిర్వర్తించకుండానే వారు వేతనాలు పొందుతుంటారు. తెలంగాణ నాన్ గెజిటెట్ అధికారుల సంఘం, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీఎఫ్ వంటి సంఘాల నేతలకు ఈ సదుపాయం ఉండేది. 2018 ఎన్నికలకు ముందు కొన్ని ఇతర సంఘాలకు కూడా కల్పించారు.
ఏడాదిగా లేదు...
ఆయా సంఘాల్లోని బాధ్యులకు ఉండే ఆన్ డ్యూటీ సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కొనసాగించడం లేదు. ఆన్ డ్యూటీ అవకాశం కల్పిస్తే ప్రతి ఏడాది అందుకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ సర్వీసెస్ విభాగం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే 2019 జనవరి నుంచి ఆన్ డ్యూటీకీ సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. అందువల్ల అప్పటి నుంచి ఆయా సంఘాల నేతలకు ఆన్ డ్యూటీ సదుపాయం లేనట్లే.
వేతనం కావాలంటే..
ఆన్ డ్యూటీ అవకాశం కల్పించాలని వివిధ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. సర్కార్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆన్ డ్యూటీ లేకపోవడం వల్ల... వేతనం కావాలంటే వారు తప్పనిసరిగా రోజువారీ విధులకు హాజరుకావాలి లేదంటే సెలవు పెట్టాల్సి ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడితోపాటు కొందరు విధుల్లో చేరారు. మరికొందరి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికసంఘాల నేతలకు యాజమాన్యం ఇప్పటికే ఆన్ డ్యూటీ రద్దు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు కూడా ఆన్ డ్యూటీ అవకాశం లేకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరికీ ఈ అవకాశం లేనట్లైంది.
ఇవీచూడండి: విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు