ఓబుళాపురం గనుల కేసుల విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో చేపడితే తనకు అభ్యంతరం లేదని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఓఎంసీ కేసును విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ గతంలో కోరగా... తనకు అభ్యంతరం లేదని గాలి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత వాదన మార్చిన సీబీఐ... విచారణ హైదరాబాద్ లోనే జరపాలని కోరింది. అభ్యంతరం లేదని జనార్దన్ రెడ్డితో పాటు మిగతా నిందితులు బీవీ శ్రీనివాసరెడ్డి, అలీ ఖాన్, ఐఏఎస్ శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు కృపానందం, రాజగోపాల్ తెలిపారు.
విచారణ ఎక్కడ జరగాలనేది చట్టం, నిబంధనల ప్రకారం జరగాలి కానీ.. దర్యాప్తు సంస్థ లేదా నిందితుల అభిమతం ప్రకారం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఒకసారి విశాఖ అని.. మరోసారి హైదరాబాద్ అని సీబీఐ గందరగోళం చేస్తోందన్నారు. అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా కౌంటరు దాఖలు చేయాలని... సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విచారణకు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీ ఖాన్, శ్రీలక్ష్మి, కృపానందం, రాజగోపాల్ హాజరయ్యారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోర్టు అనుమతితో గైర్హాజరయ్యారు.