భాగ్యనగరంలో పాదచారుల కోసం ఏప్రిల్ లోపు 800 కిలోమీటర్ల ఫుట్ పాత్‌లు నిర్మిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. హైదరాబాద్లో రోడ్ల తవ్వకాలపై జోనల్ స్థాయిలో సమన్వయం పెంచేవిదంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కమీషనర్ అధ్యక్షతన టూరిజం ప్లాజాలో పలు శాఖల అధికారులతో సిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హెచ్.ఎం.డి.ఏ, జీహెచ్ఎంసీ, మెట్రో రైలు, విద్యుత్, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వాటర్ వర్క్స్, ట్రాఫిక్ పోలీస్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రెవెన్యూ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
చెత్త తొలగింపునకు ప్రత్యేక ప్రణాళిక
వాహనాలు, పాదచారులు సౌకర్యార్థం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న చెత్తను తొలగించాలని మెట్రో అధికారులకు కమిషనర్ సూచించారు. మెట్రో పిల్లర్ల పక్కన ట్రాఫిక్ ఆటంకం కలగకుండా చూసుకుంటామన్నారు. ప్రయాణీకుల సౌకార్యార్థం ఆధునిక డిజైన్లతో నగరంలో కొత్తగా బస్ షెల్టర్లు నిర్మించనున్నట్లు లోకేష్ కుమార్ వెల్లడించారు. మెట్రో రైల్ కోసం తొలగించిన 400 బస్ షెల్టర్లను అనువైన ప్రదేశాల్లో పునర్ నిర్మించాలని కోరారు.