హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ మేనేజ్‌మెంట్-నార్మ్‌లో శాస్త్ర సాంకేతిక ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై 89వ వార్షిక జాతీయ సదస్సు ప్రారంభమైంది. డీబీటీ విశ్రాంత శాస్త్రవేత్త, ప్రధాని మాజీ సలహాదారులు ప్రొఫెసర్ మంజుశర్మ సదస్సును ప్రారంభించారు. నార్మ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్-ఎన్‌ఏఎస్‌ఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు మూడు రోజులపాటు కొనసాగనుంది. వ్యవసాయం, ఔషధ, పారిశ్రామిక రంగాల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం క్షేత్రస్థాయికి వేళ్లాలంటే... వ్యాపార నమూనాలు, ఔత్సాహిక పారిశ్రామికాభివృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆమె అన్నారు.
భాగ్యనగరంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి వ్యవసాయ పరిశోధన సంస్థలు, రసాయన, భౌతిక శాస్త్రం, ఔషధ పరిశ్రమరంగం శాస్త్రవేత్తలు హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వ్యవసాయానికి... వాతావరణ మార్పులు, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడం, సంక్షేమ పథకాలు చేరువ చేయడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతాయని నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
వ్యవసాయ, ఔషధ, పారిశ్రామిక రంగాల్లో పనిచేసే ప్రతి శాస్త్రవేత్త...విశ్రాంత జీవితంలోనూ పూర్తిగా సమాజానికి ఉపయోగపడాలని ఏవీఆర్‌ఏ ల్యాబ్ ఎండీ డాక్టర్ ఆళ్ల వెంకటరామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు పద్మభూషణ్, డాక్టర్ జి. పద్మనాభన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సత్యడియో తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్‌సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి