మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఈసీ పరిశీలకులను నియమించింది. ఒక్కో జిల్లాకు ఒక్కో ఐఏఎస్ అధికారిని పరిశీలకులుగా నియమించింది. తక్కువ మున్సిపాల్టీలు ఉన్న చోట మాత్రం పరిశీలకులకు మరో జిల్లా బాధ్యతలు కూడా అప్పగించింది.
31 జిల్లాల్లో ఎన్నికలు - 27 మంది ఐఏఎస్లు
31 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతుండగా 27 మంది ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. శ్రుతి ఓజా, విజయేంద్ర, అబ్దుల్ అజీఎం, అద్వైత్ కుమార్ సింగ్, హరిచందన, నిర్మల, పమేలా సత్పతి, పౌసుమి బసు, అలుగు వర్షిణి, కె.వై.నాయక్, చంపాలాల్, సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారుఖీ, ప్రావీణ్య తదితరులను ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.
వ్యయ పరిశీలనకు - ప్రత్యేక అధికారి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిశీలనకు కూడా ప్రత్యేకంగా పరిశీలకులను నియమించారు. జిల్లా ఆడిట్, సహాయ ఆడిట్ అధికారులను ఒక్కో జిల్లాకు ఒకరికి వ్యయ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు.
అనర్హుల వివరాలు
- పురపాలక ఎన్నికల్లో అనర్హుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
- 2014 పురపాలక ఎన్నికల్లో పోటీచేసి ఖర్చులకు లెక్కలు చెప్పని వారిపై అనర్హతా వేటు వేసింది.
- ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన రూపంలో అందించాలి. లేదంటే వారిపై మూడేళ్లపాటు అనర్హతా వేటు వేస్తారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనర్హుల సంఖ్య 1906. అత్యధికంగా రామగుండంలో 363 మంది ఉన్నారు. కరీంనగర్ లో 132, ఆదిలాబాద్ లో 113 మంది అనర్హత వేటు పడిన వారిలో ఉన్నారు.
"ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో ఇవాళ సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు"
ఇవీ చూడండి: 'పుర'పోరుపై రేపు రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం