ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులో మూడు రాజధానులను ప్రభుత్వం ప్రతిపాదించింది. శాసనసభ, శాసనమండలి అమరావతిలో కొనసాగేలా.. రాజ్‌భవన్, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు విశాఖపట్నంలో ఏర్పాటుచేసేలా.. న్యాయ సంబంధమైన సంస్థలు కొత్తగా ప్రతిపాదిస్తున్న న్యాయ రాజధాని కర్నూలుకు తరలించేలా ప్రతిపాదనలు చేశారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రసంగించారు.
'అభివృద్ధి ఒకచోటనే ఉండటం వల్ల చాలా ప్రాంతాలు వెనుకబడ్డాయి. వందేళ్ల క్రితమే కుదిరిన శ్రీబాగ్ ఒప్పందంలో వికేంద్రీకరణ గురించే ప్రధానంగా ప్రస్తావించారు. పెద్దమనుషుల ఒప్పందంలోనూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ కూడా పరిపాలన వికేంద్రీకరించాలని సూచించింది. అదే స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపులతో దీనిపై అధ్యయనం చేసింది. ఆ కమిటీలూ అదే విషయాన్ని సూచించాయి. ప్రభుత్వం మంత్రులు, అధికారులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ సూచనలు అంగీకరించింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులను ప్రతిపాదిస్తున్నాం.'
- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి
మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయం
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తున్నామని బుగ్గన స్పష్టంచేశారు. రాజధాని పేరుతో కిందటి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని బుగ్గన విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి లక్షకోట్లు కావాలని కిందటి ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. ఐదువేల కోట్లు ఖర్చుచేసి అన్నీ తాత్కాలిక భవనాలు కట్టారని.. శాశ్వత కట్టడాలు ఏమీ లేవని బుగ్గన అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ఉద్ఘాటించారు.
ఇదీ చూడండి: ఏపీలో మూడు రాజధానులు... నాలుగు పరిపాలన జోన్లు