రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం దావోస్ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో తెలంగాణ ప్రగతిని అంతర్జాతీయంగా చాటే లక్ష్యమూ ఉంది. ప్రపంచ ఆర్థిక వేదిక 50వ వార్షిక సదస్సును ఆయన ఇందుకు కేంద్ర స్థానంగా చేసుకుంటున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు స్విట్జ్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగే ఈ సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రగతిపై వివరించే అవకాశం
ఆదివారం రాత్రి దావోస్ చేరుకున్న కేటీఆర్ సోమవారం సాయంత్రం జరిగే సదస్సు స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. 21 నుంచి కార్యక్రమాలు సాగుతాయి. సమావేశాలు, చర్చాగోష్ఠులు ఉంటాయి. ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు, పలు సంస్థల అధిపతులు, సీఈవోలు, ఆర్థిక నిపుణులు హాజరవుతున్నారు. ‘నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు - సవాళ్లను నివారించడం’ అనే అంశంపై సదస్సులో కేటీఆర్ ప్రసంగిస్తారు. సాంకేతిక వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిని వివరిస్తారు.
ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటుకు అవకాశం...
సదస్సులో ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. ఇందులో కేటీఆర్ పారిశ్రామిక సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. తెలంగాణ ప్రభుత్వం ఔషధ, జీవశాస్త్రాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, జౌళి, కృత్రిమమేధ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆశిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ నగరిని నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులు, తమ పారిశ్రామిక విధానం, టీఎస్‌ఐపాస్, భూబ్యాంకు ఇతర అంశాలను కేటీఆర్ పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఆయన ఈ సదస్సుకు హాజరు కావడం ఇది రెండోసారి. ఈసారి దాదాపు 30 సంస్థలతో భేటీ కావాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 25న తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
అక్కడి నుంచే ఎన్నికల పర్యవేక్షణ
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణలో జరుగుతున్న పురపాలక ఎన్నికల దృష్ట్యా అక్కడి నుంచి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో అక్కడి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ఫోన్‌లో మాట్లాడనున్నారు.
ఇవీ చూడండి: తెరాసకు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మద్దతు