కేసీఆర్ సర్కార్ పట్టణాలకు ప్రత్యేక నిధులు, కార్పొరేషన్‌లకు బడ్జెట్‌లో నిధులు ఇస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెరాస పుర అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి... ప్రతి వార్డు, పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలని సూచించారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపైనా అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందని పేర్కొన్నారు.
వివిధ పట్టణాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనను, తెరాస పాలనను బేరీజు వేసుకుని ఓటువేయాలని ప్రజలను కోరాలని అభ్యర్థులకు సూచించారు. ప్రస్తుత స్థాయి నుంచి నివేదికల ప్రకారం తెరాస పార్టీకి పురపాలక ఎన్నికల్లో విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ అభ్యర్థులు గెలుపు మనదే అన్న ధీమాలో ప్రచారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని మంత్రి పేర్కొన్నారు. బీ ఫారం కోసం ప్రయత్నం చేసిన తోటి నాయకులను కలుపుకుని సమష్టిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి ఐదుసార్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించాలని తెలిపారు.
ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులతో మరోసారి సమావేశమవుతానని కేటీఆర్ వెల్లడించారు.