బాల్‌రెడ్డి వల్ల గర్భవతి అయి.. అబార్షన్ చేయించుకున్న కీర్తి అతడినే వివాహమాడతానని స్పష్టం చేసింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులో తల్లి రజితను హత్య చేసిన కీర్తి తన 16 ఏళ్ల వయసులోనే మొదటి ప్రియుడు బాల్‌రెడ్డికి దగ్గరైంది. అన్ని విషయాలు అతనితోనే పంచుకునేది. తల్లి లేనప్పుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లేది. గత ఏడాది సెప్టెంబరులో గర్భం దాల్చినట్టు ఆమెకు అనుమానం వచ్చింది. అప్పుడు బాల్‌రెడ్డి బెంగళూరులో ఉన్నాడు.
అబార్షన్ చేయించుకున్న కీర్తి...
- గర్భధారణ వల్ల కలిగే మార్పులేమిటా అని అంతర్జాలంలో శోధించింది. కొన్ని లక్షణాలు ఖరారు కావడం వల్ల తను అన్నయ్యా అని పిలిచే శశికుమార్‌కు చెప్పింది.
- మందుల దుకాణానికి వెళ్లి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చి పరీక్షించుకోగా, గర్భం నిర్ధారణ అయ్యింది. తర్వాత శశికుమార్ ఇంటికి ల్యాబ్ సిబ్బందిని రప్పించి పరీక్ష చేయిస్తే, వారు ఆమెకు నాలుగో నెల అని ధ్రువీకరించారు.
గర్భస్రావం కోసం ఆసుపత్రులకు తిరిగారు
కీర్తి గర్భం దాల్చిందని తెలిసి, బాల్‌రెడ్డి నగరానికొచ్చాడు. గర్భస్రావం కోసం కొన్ని ఆసుపత్రులకు ఫోన్ చేశాడు. రెండు రోజుల విశ్రాంతి అవసరమవుతుందని వైద్యులు చెప్పడంతో శశికుమార్ సాయం తీసుకున్నారు. రజితను ఒప్పించి శశికుమార్ కారులో కీర్తిని కొంత దూరం తీసుకొచ్చాడు. అక్కడి నుంచి బాల్‌రెడ్డి, కీర్తి మాత్రమే ఆమన్‌గల్ వెళ్లారు. బాల్‌రెడ్డి మిత్రుడు నాయక్ సాయంతో ఆమన్‌గల్‌లో గర్భస్రావం చేయించి రెండు రోజులు అక్కడే ఉన్నారు.
అమాయకత్వమా... నేరతత్వమా..?
తల్లిని హత్య చేసే ముందు, మృతదేహాన్ని తరలించేటప్పుడు కూడా తాను మద్యం తాగినట్లు పోలీసుల వద్ద కీర్తి అంగీకరించినట్టు సమాచారం. గురువారం న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన హయత్‌నగర్ పోలీసులు ఆమె తీరు చూసి ముక్కున వేలేసుకున్నారు. ‘బై.. బై సర్.. మళ్లీ కలుస్తా’ అంటూ ఆమె వారికి వీడ్కోలు చెప్పడంతో... ఆమెది అమాయకత్వమో... నేర మనస్తత్వమో అర్థం కాక విస్తుపోయారు.