రాష్ట్రంలో దాదాపు 1.17లక్షల మంది కల్యాణలక్ష్మి సాయం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. డిమాండ్ మేరకు చెల్లింపులు లేకపోవడం వల్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 1.16లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినప్పటికీ కొత్తగా వస్తున్న అర్జీలతో వివిధ శాఖలకు నిధుల సమస్య ఎదురవుతుంది.
"కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసిన తర్వాత 45 రోజుల్లో పరిష్కరించి లబ్ధిదారులకు చెక్కును అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకావడం లేదు. దరఖాస్తు చేసిన ఏడాదికి సైతం సహాయం అందడంలేదు"
వేల సంఖ్యలో పెండింగ్
ఏడాది క్రితం వచ్చిన దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉండడం గమనార్హం. ఈ తరహా దరఖాస్తులు వేలసంఖ్యలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అందిన దరఖాస్తులతో కలిపి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేయాలంటే కనీసం రూ.2,218 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
సుమారు వెయ్యి కోట్లు అవసరం
అయితే 2019-20 ఏడాదిలో పరిష్కరించిన దరఖాస్తులకు దాదాపు రూ.1,261 చెల్లించారు. మిగితా పెండింగ్ దరఖాస్తులకు సుమారు మరో వెయ్యి కోట్లు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. జనవరి నుంచి మార్చి వరకు వివాహాలకు ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. ఆ సమయంలో భారీగా దరఖాస్తులు వస్తాయని సంక్షేమశాఖలు అంచనా వేస్తున్నాయి. ఈనేపథ్యంలో పెండింగ్ డిమాండ్ రూ.1,300 కోట్లకు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: సంక్రాంతికి సంసిద్ధం: జనవరి 10 నుంచి ప్రత్యేక బస్సులు