అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి నాంపల్లి గగన్ విహార్‌లోని సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నేరుగా నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త ఇందూ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ తదితరులు విచారణకు హాజరయ్యారు. గత 8ఏళ్లుగా ఈకేసు విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. డిశ్చార్జి పిటిషన్లన్నీ కలిపి విచారణ చేపట్టాలని జగన్ విన్నవించారు. సీబీఐ, ఈడీ కోర్టు ఈ నిర్ణయాన్ని ఈనెల 17కి వాయిదా వేసింది.
సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు సహా ఈడీ నమోదు చేసిన 6 అభియోగపత్రాలకు సంబంధించిన విచారణకు ఇవాళ జగన్, విజయసాయిరెడ్డి కచ్చితంగా హాజరుకావాలని ఈనెల 3న సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ గతేడాది మార్చి 22న చివరిసారిగా కోర్టుకు హాజరయ్యారు. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. అయితే..ముఖ్యమంత్రిగా వివిధ కార్యక్రమాలను కారణంగా చూపుతూ జగన్.. ప్రతి శుక్రవారం హాజరు నుంచి మినహాయింపు పొందారు. ప్రతి శుక్రవారం మినహాయింపు కోరడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఇవాళ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించింది. సీఎం జగన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అనంతరం విచారణకు హాజరయ్యారు.