హుజూర్నగర్ ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్‌లో వేడి పుట్టిస్తోంది. నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రాజుకుంటున్నాయి. శాసనసభ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు నిరాశజనక ఫలితాలే వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచి కాస్త ఊరట చెందినప్పటికీ... అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పద్మావతి ఘోరపరాజయంతో అసమ్మతి సెగులు రగులుతున్నాయి. శాసనసభ ఎన్నికల అనంతరమే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపించినా... అలాంటిదేమీ జరగలేదు. పార్టీ నాయకత్వ మార్పు సహా అన్ని అంశాలపై చర్చించాలని అధిష్ఠానాన్ని కోరాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.
అభ్యర్థినెలా ప్రకటిస్తారు?
ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పుడే నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఉత్తమ్ ప్రకటించడంపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అధిష్ఠానం అనుమతి లేకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంటియా దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ జోక్యం అవసరం లేదని నల్గొండ జిల్లా నేతలు ఉత్తమ్‌కు బాసటగా నిలిచారు. ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా రేవంత్‌ను ప్రచారానికి తీసుకొచ్చి నేతలు జాగ్రత్తపడ్డారు.
నాయకత్వం మార్చాల్సిందే!
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడిపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరినీ సంప్రదించకుండా వ్యవహరిస్తున్న రేవంత్‌ను కట్టడి చేయాలని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున... నాయకత్వ మార్పు, పార్టీ పునః వ్యవస్థీకరణపై దృష్టి సారించాలని పేర్కొంటున్నారు. నాయకత్వ మార్పు పుర ఎన్నికల్లో ప్రభావం చూపుందని పలువురు నేతలు అభిప్రాయపడుతుంటే... తాజా పరిస్థితుల్ని అసమ్మతి నేతలు అవకాశంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ కంచుకోటలో పరిమళించిన గులాబీ