ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల నాయకులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చల్లో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. అన్ని డిమాండ్లనూ చర్చించాలని యూనియన్ నాయకులు కోరగా.. కోర్టు సూచించిన మేరకు 21 అంశాలపైనే చర్చిస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు.
అధికారులు మళ్లీ చర్చలకు పిలుస్తారని ఎదురుచూసి వెళ్లిపోతున్నామని ముందుగా విలేకరులతో మాట్లాడిన కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. యూనియన్ల నాయకులు మళ్లీ వస్తారని ఎదురుచూశామని.. వారు రాకపోవడంతో తామే వెళ్లిపోతున్నామని.. ఆర్టీసీ తరఫున చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. చర్చల సారాంశాన్ని కోర్టుకు నివేదిస్తామన్నారు.
గంటన్నర పాటు భేటీ
సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించాలన్న హైకోర్టు సూచన మేరకు శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఎర్రమంజిల్‌లోని రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇరువర్గాల వారు మధ్యాహ్నం సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు చర్చలు జరిగాయి. ప్రభుత్వ పక్షాన ఆర్టీసీ ఇన్‌ఛార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొనగా కార్మిక సంఘాల పక్షాన అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కుదరని ఏకాభిప్రాయం
చర్చల సందర్భంగా 21 అంశాలతో ఎజెండాను అధికారులు కార్మిక సంఘాల ముందు పెట్టారు. ఆ ఎజెండాపై కార్మిక సంఘాల ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్న రెండు సంఘాలిచ్చిన అన్ని డిమాండ్లపై చర్చించాలని సంఘాలు పట్టుపట్టాయి. న్యాయస్థానం గుర్తించిన 21 అంశాలపై మాత్రమే చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
చర్చల తీరు వీడియోలో చిత్రీకరణ..
చర్చల తీరుపై కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశాయి. లోపలికి వెళ్లిన తరువాత కార్మిక సంఘాల ప్రతినిధుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లను చర్చలు జరిగే గదిలోకి అధికారులు అనుమతించలేదు. ముందుగానే వాటిని పోలీసులు డిపాజిట్ చేయించుకున్నారు. చర్చల తీరును వీడియోలో చిత్రీకరించారు.
వక్రభాష్యం తగదు: అశ్వత్థామరెడ్డి
ముందుగా సిద్ధం చేసుకున్న ఎజెండాపై చర్చించాలని అధికారులు పట్టుపట్టారు. పరిమిత ఎజెండాలోని డిమాండ్లకే పరిమితమయ్యే అధికారం మాకు లేదు. కార్మికులు, ఇతర నాయకులతో చర్చించిన మీదట నిర్ణయం చెబుతామని అధికారులకు చెప్పాం. గంట తరువాతైనా, రేపు పిలిచినా చర్చలకు సిద్ధమని అధికారులకు చెప్పాం. చర్చల నుంచి మేం బయటకు రాలేదు. ముందుగా అధికారులే వెళ్లిపోయారు.
వాళ్లే మధ్యలో వెళ్లిపోయారు: సునీల్‌శర్మ
ప్రభుత్వంలో విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చించాలని పట్టుబట్టగా అది సాధ్యం కాదన్నామని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమన్నారు. మూడు అవకాశాలిచ్చినా ఐకాస నేతలు డిమాండ్లపై చర్చించలేదు. దీనిపై హైకోర్టుకు నివేదిక ఇస్తాం.
21 అంశాలపై చర్చకు ఐకాస నేతలు ఒప్పుకోలేదు
హైకోర్టు చెప్పిన 21 అంశాలపై ఒక్కో డిమాండ్‌పై చర్చిస్తామని చెబితే ఐకాస నేతలు ఒప్పుకోలేదు. ఓసారి 26 డిమాండ్లకు, మరోసారి 45 డిమాండ్లకు పట్టుబట్టారు. బయటకు వెళ్లి వచ్చి విలీనంపై చర్చ జరగాలన్నారు. అది అసాధ్యమని చెప్పాం. దీనికి ఒప్పుకోని ఐకాస నేతలు మా సభ్యులతో చర్చిస్తామని నాలుగు గంటలకు బయటకు వెళ్లి తిరిగిరాలేదు.
- సందీప్ కుమార్ సుల్తానియా, రవాణాశాఖ కమిషనర్