తెలంగాణలో నూతన మద్యం విధానం వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి రానుంది. రెండేళ్లపాటు ఈ కొత్త విధానం కొనసాగనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, లాటరీ విధానం ద్వారా లైసెన్స్‌ల జారీ ప్రక్రియ పూర్తైంది. 2017-19 సంవత్సరంలో 40 వేల 918 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.411 కోట్ల రాబడి వచ్చింది. తాజాగా దరఖాస్తు రుసుము లక్ష నుంచి 2 లక్షలకు పెంచడం, 48వేల 402 దరఖాస్తులు రావడం వల్ల ఈసారి రూ. 968.04 కోట్లకు పెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 2, 216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయిదు దుకాణాలు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో 7, రంగారెడ్డిలో 2, నిజామాబాద్‌లో 10, కరీంనగర్‌లో 8, మేడ్చల్ మల్కాజిగిరిలో 2 దుకాణాల విషయంలో... సిండికేట్ ఏర్పడి ఉండొచ్చనే అనుమానంతో ప్రక్రియ నిలిపేశారు. మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించగా... దాదాపు 500 దాఖలైనట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డ్రా ద్వారా లెసెన్సీ ఎంపిక జరగనుంది.
ఏటేటా పెరుగుతోంది...
మూడు దపాల నుంచి లైసెన్స్ రుసుము, ఎక్సైజ్ పన్ను ద్వారా ప్రభుత్వానికి రాబడి క్రమంగా పెరుగుతోంది. 2,216 దుకాణాల ఏర్పాటుకు... 2015-17లో ఎక్సైజ్ పన్ను కింద రూ.1260 కోట్లు, 2017-19లో రూ.1360 కోట్ల ఆదాయం రాగా, 2019-21 సంవత్సరానికి రూ.1506 కోట్లు వస్తుందని అబ్కారీశాఖ అధికారుల తెలిపారు. ప్రత్యేక రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా ప్రతి లైసెన్సీ రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉన్నందున అధనంగా వచ్చే రూ.110.80 కోట్లతో కలిపి రూ. 1616.75 కోట్ల రాబడి రాష్ట్ర ఖజానాకు జమ కానుంది. ఇప్పటికే లైసెన్స్‌లు దక్కించుకున్న వారు మొత్తం ఎక్సైజ్ ట్యాక్స్‌లో నాలుగో వంతు చెల్లించారు. మిగిలిన సొమ్ము నెలాఖరులోపు అందచేయాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: పుర ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్