రాష్ట్ర రాజధానిలోని వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై ‘"ఈనాడు"’ ప్రచురించిన కథనంపై హైకోర్టు స్పందించింది. గత నెల 19న హైదరాబాద్ జిల్లా ఎడిషన్‌లో ‘వసతి వణుకుతోంది’ పేరిట కథనం ప్రచురితమైంది.
కనీస సదుపాయాలు లేవు
హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో కనీస సదుపాయాలు లేవని ఆ కథనంలో "ఈనాడు" వివరించింది. ముఖ్యంగా శీతాకాలంలో దుప్పట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు స్పందించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్‌కు లేఖ రాశారు.
మానసిక వికాసానికి మంచి వాతావరణం అవసరం
విద్యార్థులు దేశభవిష్యత్తు అని.. మానసిక వికాసానికి మంచి వాతావరణం అవసరమని జస్టిస్ పి.నవీన్‌రావు లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. "ఈనాడు" కథనాన్ని సుమోటోగా స్వీకరించి ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించింది. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌తో పాటు సాంఘిక, మహిళా సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, సాంఘిక సంక్షేమశాఖ అధికారులను ప్రతివాదులుగా పేర్కొంటూ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.