హీరా గ్రూప్స్ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఉన్నత న్యాయస్థానం మంజూరు చేసింది. రూ.5 కోట్ల పూచీకత్తు ఇవ్వాలని... దేశాన్ని విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. హీరాగ్రూప్స్పై నమోదైన కేసులున్నీ తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని ఆదేశించింది.
బంగారంలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపి నౌహీరా షేక్.. రూ.6వేల కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసింది. సుమారు లక్షా 25వేల మంది మదుపుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో ఆమెపై సీసీఎస్, బంజారాహిల్స్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోనూ నౌహీరా షేక్‌పై కేసులున్నాయి. విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు స్వీకరించారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. సీసీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా ప్రస్తుతం నౌహీరా షేక్ చంచల్ గూడ మహిళా జైలులో జ్యూడిషియల్ ఖైదీగా ఉన్నారు.
పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారని హైకోర్టులో నౌహీరా షేక్ తరఫు న్యాయవాది వాదించారు. పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను తీవ్ర మోసాల దర్యాప్తు సంస్థ విచారించాలనే నిబంధన ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నౌహీరాకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదముందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు... బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు సమర్పించడంతో పాటు... ష్యూరిటీలు ఇచ్చిన తర్వాత చంచల్ గూడ జైలు నుంచి నౌహీరా విడుదలయ్యే అవకాశం ఉంది.